జాతీయ వార్తలు

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై మిలిటెంట్ల బాంబు దాడి..

శక్తి టీవీ, మణిపుర్‌ :- ఈ శాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని మోరేలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. బాంబులు, రాకెట్‌ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలొ పోలీసు కమాండో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో కమాండో పోస్ట్‌ వద్దనున్న పలు వాహనాలు ధ్వంసమైనట్లు వెల్లడించాయి. మిలిటెంట్ల దాడిని భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం భీకర కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల మోరే ప్రాంతంలో ఓ పోలీసు అధికారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెండు రోజుల కిందట కుకీ గ్రూప్‌లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. మోరే నుంచి రాష్ట్ర పోలీసులను పంపించాలని డిమాండ్‌ చేశాయి. ఈ ఆందోళనలు జరిగిన రోజుల వ్యవధిలోనే తాజాగా కమాండ్‌ పోస్ట్‌పై దాడి జరగడం గమనార్హం. ఈ దాడికి పాల్పడింది కుకీ మిలిటెంట్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

మణిపుర్‌లో గతేడాది కొన్ని నెలల పాటు తీవ్ర ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ హింసాత్మక ఘటనల్లో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న వేళ.. మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply