Subsidiary Of KPS Digital Media Network

జాతీయ వార్తలు

తలపతి విజయ్ టార్గెట్ 2026.. మాస్టర్ ప్లాన్ ఇదేనా ?

శక్తి టీవీ, తమిళనాడు :- విజయ్ పార్టీ ప్రకటనతో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. విజయ్ ఇచ్చిన సూచనలు, ప్లాన్ చేసిన నేపధ్యం ఈసారి తళపతికి సీఎం ట్యాగ్ ఇస్తుందనే ఊహాగాలు ఆల్రెడీ మొదలయ్యాయి. భారత సార్వత్రిక ఎన్నికలను వదిలేసి, 2026లో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంపై మరింత చర్చ రాజుకుంది. రాష్ట్రంలో రాజకీయ పోటీ గట్టిగానే ఉన్న నేపథ్యంలో “తమిళగ వెట్రి కజగం” భవిష్యత్తు ఎలా ఉంటుందోననే వాదనలు ఊపందుకున్నాయి.

విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గత ఐదేళ్లుగా ప్రచారం జరుగుతుంటే మొత్తానికి ఇప్పుడు వాస్తవంలోకి వచ్చింది. అప్పటికే.. తన సినిమాల్లో పాయింటెడ్ పంచ్ డైలాగ్‌లతో పొలిటికల్ ఎంట్రీపై సూచనలు ఇస్తునే ఉన్నాడు. ‘మెర్సల్‌’ మూవీలో జీఎస్టీకి వ్యతిరేకంగా కాస్త సైటైర్ వేయగా.. ‘సర్కార్‌’ సినిమాలో ఫ్రీబీస్ కల్చర్ టార్గెట్‌గా బిగ్ పంచ్ ఇచ్చాడు. ఇలా పలు చిత్రాల్లో పొలిటకల్ టచ్ డైలాగులతో స్లోగా ఫ్యాన్స్‌ను రెడీ చేశాడు విజయ్. అంతెందుకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘తళపతి’ అనే పేరు కూడా నాయకుడు కావాలన్న ఉద్దేశంతోనే ప్లాన్ చేశారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పొలిటికల్ ఎంట్రీపై కూడా ఇలాంటి సస్పెన్సే కొనసాగగా.. ఆయన సినిమాల్లో ఇంతలా రాజకీయ డైలాగులు చేర్చలేదు. కానీ తర్వాతి తరం సూపర్ స్టార్ అయిన విజయ్ మాత్రం నీట్‌గా ప్లాన్ చేసుకొని క్లూలు ఇచ్చుకుంటూ వచ్చాడు. తన ఫ్యాన్స్ క్లబ్ పేరుతోనే ఎన్నికలు గెలిచేటంతగా తన రాజకీయ వేదికను సిద్ధం చేసుకున్నాడు.

అసలు.. విజయ్ రాజకీయ ప్రస్తానాన్ని తన తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ ప్రారంభించారు. 2009లో తన ఫ్యాన్ క్లబ్ ప్రారంభించిన రోజే దీనికి బీజం పడింది. ఆ తర్వాత పరిణామాల్లో విజయ్ అభిమానుల సంఘం, 2011లో జయలలిత నేతృత్వంలోని అప్పటి ఏఐఏడీఎంకేకు తన మద్దతును ప్రకటించింది. అప్పట్లో సన్ టీవీ నిర్మించిన విజయ్ ‘సుర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాంబు పేల్చిన సందర్భంలో, విజయ్.. తన తండ్రి చంద్రశేఖర్ ఇద్దరూ డీఎంకేతో విభేదించిన సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 38 జిల్లాల్లో విజయ్ అభిమానుల సంఘం శాఖలు బలంగా ఉన్నాయి. 2020 నవంబర్‌లో, విజయ్ పేరు మీద తన తండ్రి ‘తళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్’ అనే రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసినప్పుడు, విజయ్ ఆ పార్టీకీ తనకూ సంబంధం లేదన్నట్లే మాట్లాడాడు. పార్టీకి దూరంగానూ ఉన్నాడు. తన పేరుతో తండ్రి రిజిస్టర్ చేసిన పార్టీలో భాగం కావద్దని తన ఫ్యాన్ క్లబ్ సభ్యులను కూడా కోరాడు.

ఇలా.. విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎప్పుడూ ఖచ్చితమైన ప్లాన్స్ చేసుకోనట్లే కనిపించేవాడు. కానీ.. సర్‌ప్రైజింగ్‌గా, TVMI పార్టీ సభ్యులు 2021లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి, 169 స్థానాలకు గానూ 115 గెలుచుకున్నారు. 13 స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా, విజయ్ తన రాజకీయ ప్రణాళికల గురించి మౌనం వహిస్తున్న సయంలోనే 2021 లోకల్ బాడీ పోల్‌లో TVMI పనితీరు రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’గా రూపాంతరం చెందిన TVMI, తమ తళపతి విజయ్ అడుగు పెట్టకముందే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్‌వర్క్‌ను పూర్తి చేసేశారు. కాగా, ఇప్పుడు తాజాగా ప్రకటించిన TVKకి ప్రత్యేకంగా ప్రచారం అవసరంలేదనే స్థాయిలో విజయ్ పొలిటికల్ వేదిక తయారుగా ఉంది.

విజయ్‌కి యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది తాను ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటే చాలా ఉపయోగపడుతుంది. అయితే.. ఫ్యాన్స్‌కు మించి తన అభిమానుల్ని పెంచుకున్నాడు విజయ్. సినిమాల్లో గ్రాఫ్‌ను పెంచుకున్నట్లే రాజకీయా ఎంట్రీ విషయంలో కూడా ఆచితూచి అడుగులేశాడు. ఏది ఏమైనప్పటికీ, విజయ్ పూర్తిగా రాజకీయాల్లో ఉండగలడో లేదో వేచి చూడాలి. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుండో చర్చిస్తున్న విశ్లేషకులు అంచనా ప్రకారం అయితే.. విజయ్ దృష్టి ఇప్పటి కోసం కాదు. భవిష్యత్తు కోసం అనే మాట నిజమయ్యింది. గట్టి ప్లాన్ వేసుకొనే ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాడని అర్థమవుతోంది. అందులో భాగంగానే.. ఇటీవల కాలంలో స్కూల్స్, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టాడు. వీళ్లంతా మరో దశాబ్దం తర్వాత ప్రధాన ఓటింగ్ సెగ్మెంట్‌గా ఉండే వాళ్లే. ఆ కోణంలో చూస్తే, అప్పటికి విజయ్ ప్రత్యర్థులుగా ఉదయనిధి స్టాలిన్, అన్నామలై, సీమాన్ వంటి వారంతా దిగే అవకాశం ఉంది. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలకే వస్తున్నాడు గనుక.. అవకాశాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తేలిపోతుంది. ఏదేమైనా.. తళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు రాజకీయాల్లో తీవ్రమైన మార్పులకు కారణం అవుతుందనేది మాత్రం కచ్చితం అంటున్నారు నిపుణులు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×