ఆంధ్రప్రదేశ్

వై నాట్ సునీత..? ఆసక్తికరంగా కడప రాజకీయం..

శక్తి టీవీ, కడప :- రాష్ట్ర విభజన తర్వాత అసలు జెండా మోసే వారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు గాను ఆల్రెడీ అభ్యర్ధులుగా ఎవర్ని నిలబెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. తొలి విడతగా ఎంపీ అభ్యర్ధులను కూడా ప్రకటించింది.ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దూకుడు ఎలా ఉంటుందో కాని, కడప జిల్లా రాజకీయం మాత్రం ఆసక్తికరంగా తయారైంది.

కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఈ సారి దివంగత వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. ఒక వేళ డాక్టర్ ఇష్టపడకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేరు కూడా ఫోకస్ అయింది. వివేకా కుటుంబం నుంచి ఎవరోఒకరు పోటీలో ఉంటే టీడీపీ, జనసేనలు మద్దతిస్తాయని భావించారు.

అయితే అన్ని పార్టీ అభ్యర్ధుల ప్రకటనతో ఆ ప్రచారమంతా ఒట్టిదే అని తేలిపోయింది. టీడీపీ ఇప్పటికే కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి పేరును ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీకి సిద్దమయ్యారు.

రాయలసీమలో అదీ వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న కడప జిల్లాలో వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబం చీలిపోయింది. రెండు సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రస్తుత కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. తండ్రి హత్య కేసుకు సంబంధించి అటు జగన్‌తో పాటు అవినాష్ ఫ్యామిలీపై వివేకా కుమార్తె న్యాయపోరాటం చేస్తున్నారు.

తన తండ్రి హత్యకు వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిలు కుట్ర పన్నారని, అవినాష్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించి.. నిందితుడిగా తేల్చిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెటిచ్చి ఓట్లు వేయాలని అడగటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. తన తండ్రి రక్తంతో వైసీపీ పునాదులు వేసుకుందని. ఆ కేసులో నిందితులకు, వారిని వెనకేసుకొస్తున్న ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.

కడప జిల్లా రాజకీయాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత ప్రభావితం చేశారో వివేకా కూడా అంతే పాత్ర పోషించారంటారు. దివంగత సీఎం రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉంటే జిల్లా రాజకీయం వివేకా కనుసన్నల్లోనే నడిచేది. సౌమ్యుడిగా అందరితో కలిసిపోయే నేతగా పేరున్న వివేకాకు కడప జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వివేకా కుమార్తె సునీత హంతకులకు ఓటేయవద్దని కోరడం ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది.

సునీత న్యాయపోరాటానికి మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల అవినాష్‌రెడ్డిపై పోటీకి దిగడంతో వైసీపీకి కడపలో కష్టకాలమే అంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చెప్పట్టినప్పటి నుంచి జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్న షర్మిల, పార్టీ అధిష్టానం మేరకే తాను పోటీలో ఉంటున్నట్లు ప్రకటించినప్పటికీ అవినాష్‌కు చెక్ పెట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.

కాంగ్రెస్ కేండెట్‌గా షర్మిల ఓకే అవ్వడంతో వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపించకపోతుండటంతో పులివెందులలో జగన్‌పై కాంగ్రెస్ అభ్యర్ధినిగాపోటీకి దిగుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సునీత కాకపోతే ఆమె తల్లి అయినా పోటీలో ఉంటారన్న టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది.

మరి వైఎస్ వివేకా రాజకీయ వారసత్వం ఎవరైనా కొనసాగిస్తారో లేదో కాని కడప ఎంపీ అభ్యర్ధిగా షర్మిల బరిలోకి దిగడంతో అవినాష్‌కు గండం తప్పదంటున్నారు. ఆయన హ్యాట్రిక్ విజయం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ కుటుంబ విభేదాలతో పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు టీడీపీ అభ్యర్ధి భూపేష్‌రెడ్డి గట్టెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. కడప ఎంపీ స్ధానం పరిధిలోని జమ్మలమడుగు నుంచి భూపేష్ బాబాయి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీలో ఉండటం టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి కడప ఎంపీ సీటు స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు.

Leave a Reply