ఆంధ్రప్రదేశ్

వైసీపీలో టికెట్ల పంచాయితీ.. జగన్‌కి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతలు

శక్తి టీవీ, ఆంధ్రప్రదేశ్ :- సీఎం జగన్‌ సన్నిహితులు, ఆయన కుటుంబసభ్యుల్లా మెలిగినవారు, వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెపుతుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం తన రాజీనామాను ప్రకటించారు. అడుగడుగునా అవమానాలను భరిస్తూ వైసీపీలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. జగన్‌పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితోపాటు ఇప్పుడు బాలశౌరి చేరారు. వీరంతా సొంత పార్టీకే ప్రత్యర్ధులుగా పోటీ చేయనుండటం వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది.

అభ్యర్ధుల ప్రకటనలో జగన్ ప్రదర్శిస్తున్న దూకుడు వైసీపీ శ్రేణులకే మింగుడు పడటం లేదంట. సిట్టింగులుగా ఉన్న కీలక నేతలను దూరం చేసుకుంటున్న ఆయన.. పార్టీలో చేరీచేరగానే కొందరికి టికెట్లు ప్రకటిస్తుండటంతో.. ఆయా సెగ్మెంట్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ ఇంకా చేరని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి అదే ఎంపీ టికెట్‌ ప్రకటించారు. దాంతో రెండు సార్లుగా ఎంపీగా గెలిచి తమకు ప్రత్యర్ధిగా ఉన్న నానికి అక్కడి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వైసీపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.

అదలా ఉంటే వివిధ జిల్లాల నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ల కోసం ముగ్గురు నలుగురు ప్రయత్నిస్తుండటం అన్ని పార్టీల్లో కలవరం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు పోటీగా ఎవి సుబ్బారెడ్డి, భూమా కిషొర్ రెడ్డిలు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సైతం తానే అభ్యర్ధిని అన్నట్లు హడావుడి చేస్తున్నారు. అలాగే ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల జితేంద్రనాథ్‌రెడ్డితో అక్కడి విద్యాసంస్థల చైర్మన్, బలిజ సామాజికవర్గానికి చెందిన రఘురాం టికెట్ కోసం పోటీ పడుతున్నారు

నంద్యాల అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యేలు ఫరూఖ్, భూమా బ్రహ్మనందరెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. డోన్ టిడిపిలో ధర్మవరపు సుబ్బారెడ్డి, కేఈ ప్రభాకర్ , కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బిజ్జం పార్థసారధిరెడ్డిలు టికెట్ దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఆదోని టీడీపీ లో సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. మీనాక్షి నాయుడుతో పాటు ఫుడ్ కమిషన్ మాజీ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిర భాస్కర్ రెడ్డి, ఎసి శ్రీకాంత్ రెడ్డి, నకేష్ రెడ్డిలు ఆదోని టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ కేడర్‌లో గందరగోళం రేపుతున్నారు.

ఆలూరు టీడీపీలో కోట్ల సుజాతమ్మ, వైకుంఠము జ్యోతి, వీరభద్ర గౌడ్ టికెట్ కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. పత్తికొండలో ఆ పార్టీ టికెట్ కోసం కెఇ శ్యామ్, ప్రభాకర్‌లు పోటీ పడుతున్నారు. శ్రీశైలంలోనూ బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎరాసు ప్రతాప్ రెడ్డిల మధ్య టీడీపీ టికెట్ వార్ నడుస్తోంది. ప్రోద్దటూరులో లింగారెడ్డి, ప్రవీణ్ కూమార్ రెడ్డి, వరదరాజులరెడ్డిలు టీడీపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారంట. మైదుకూరు టీడీపీ టికెట్ పుట్టా సుదాకర్ యాదవ్‌కు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ. మాజీ మంత్రి వీఎల్ రవీంద్రారెడ్డి కూడా అక్కడ నుంచి పోటీకి ప్రయత్నస్తున్నారంటున్నారు.

రాయచోటి, రాజంపేటల్లో కూడా టిడీపీ టికెట్ కోసం నలుగురేసి నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు జనసేన నాయకులు సైతం రాజంపేట టికెట్ ఆశిస్తున్నారు. జనసేన టికెట్ అడుగుతుంది. మదనపల్లి టీడీపీలోనూ మూడుముక్కలాట నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు రమేష్, షాజహాన్ భాషాలతో పాటు, తెలుగు యువత రాష్టా అధ్యక్షుడు శ్రీరాం చిన బాబు రేసులో కనిపిస్తున్నారు. మదనపల్లిలో జనసేన నేత రాందాస్ చౌదరి కూడా పోటీకి సిద్దమవ్వడం ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీలో ఎమ్మెల్యే అన్న రాంబాబు ఉన్నప్పటికీ అక్కడ వైసీపీ టికెట్ దక్కించుకోవడానికి కామూరి రమణారెడ్డి, కడప వంశధర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్తిస్తున్నారు. టీడీపీలో ముత్తుముల అశోక్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డిల మధ్య వార్ నడుస్తోంది. ఇక మార్కాపురం వైసీపీ టికెట్ కోసం కుందూరి నాగార్జున రెడ్డి, జంకే వెంకటరెడ్డిలు పోటాపోటీగా కాలు దువ్వుకుంటున్నారు. కనిగిరి వైసీపీ టికెట్ కోసం బుర్ర మధు సుదన్,
కదిరి బాబు రావు, చింతలచెరువు సత్యనారాణరెడ్డిలు తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. కందుకూరులో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఇంటూరి నాగేశ్వరావు, ఇంటూరి రాజేష్‌లు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Leave a Reply