సిని వార్తలు

చిరంజీవి సినిమాలో బూస్టర్ డోస్ అవసరమా?

హైదరాబాద్ : ఆచార్య సినిమా దెబ్బకి చిరంజీవి గేమ్ ప్లాన్ ఛేంజ్ చేశాడా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ని తీసుకోవడం వల్ల ఉత్తర దేశ ప్రజలకి చేరువకావచ్చు అని అనుకోవచ్చు. అదే కొత్తగా వచ్చే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ తో చేయడం చూస్తుంటే, సినిమాని మరొక లెవల్ కి తీసుకువెళ్లేందుకు చేసే ప్రయత్నమే అంటున్నారు. మరి ఆ కథా కమామిషు ఏమిటో చూద్దామా…

చిరంజీవి ఒక హిట్ కోసం చూస్తున్నాడా? అంటే అవుననే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తూ మంచి కలెక్షన్స్ రాబడుతున్న చిరంజీవికి సడన్ గా ఆచార్య ఒక గుణపాఠాన్ని నేర్పిందని అంటున్నారు.

ఎలాగంటే పాతరోజుల్లో చిరంజీవి సినిమా ఎలా ఉన్నా సరే, నిర్మాత నష్టపోవడమనేది ఉండేది కాదు. సినిమా అట్టర్ ప్లాఫ్ అయినా సరే, నిర్మాత రోడ్డుపైకి వచ్చేసేవాడు కాదు. ఏదొక వ్యాపారం చేసుకోవడానికి, లేదా గౌరవంగా ఇంటికి వెళ్లడానికైనా డబ్బులుండేవి. అంత మాస్ ఇమేజ్ ఆయన సొంతం. సినిమా హిట్టు అయితే లాభాల పంట, యావరేజ్ అయితే కొంతలో కొంత సంతోషం అన్నట్టు ఉండేది.

అలా ఆయన సినిమాలకి మినిమమ్ గ్యారంటీ ఉండేది. అందుకే ఇండస్ట్రీలో ఒక దశలో మెగా స్టార్ గా మెరిసిపోయారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఊహించనది ఒకటి జరిగింది. సినిమా బాగా లేకపోతే, అది ఎంతటి గొప్ప హీరో సినిమా అయినా సరే, అది చిరంజీవి ( ఆచార్య), ప్రభాస్ ( సాహో, రాథేశ్యామ్) మహేష్ బాబు (బ్రహ్మోత్సవం, ఎస్ నేనొక్కడినే) అల్లు అర్జున్ (నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా, ఇద్దరు అమ్మాయిలతో, బద్రీనాథ్), రాంచరణ్ (వినయ విధేయ రామ, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ) ఇలా ఎవరి సినిమా అయినా సరే… థియేటర్ కి జనం రావడం లేదు. అందువల్ల మూడు రోజులకే బోర్డు తిప్పేస్తున్నారు.

అదే సినిమా బాగుంటే ఎంత చిన్న సినిమా అయినా సరే చూస్తున్నారనే సంగతి గ్రహించారు. ఉదాహరణకి డీజే టిల్లు, సీతారామం లాంటి సినిమాలు చెప్పవచ్చు. ఈ పరిస్థితులని సరిగ్గా స్టడీ చేసిన చిరంజీవి కథల విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. అందుకే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్, కొత్త సినిమా వాల్తేరు వీరయ్య లో రవితేజ లను తీసుకోవడమని సినిమా జనం చెప్పుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో చిరంజీవి మార్కెట్ లేదా అంటే ఉంది. అదెక్కడికీ పోలేదు. కానీ వాళ్లు కూడా చిరంజీవిలాగే వయసులో పెద్దవాళ్లయి పోయారు. కొందరు ఉద్యోగాల్లో రిటైరైపోయారు. దీంతో కొత్త జనరేషన్ వచ్చింది. ఇప్పుడు చిరంజీవి వాళ్లకి కూడా నచ్చాలి.

అలాగే ఆ రోజుల్లో చిరంజీవి సినిమా తప్పకుండా చూడాలనే అభిమానంతో ఇంటిళ్లపాదీ ఏదోరకంగా వెళ్లేవారు. స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో, ఖాళీగా ఉన్నప్పుడో సరదాగా సినిమాకి వెళదామంటూ చూసేసేవారు. కానీ ఇప్పుడు ఎవరూ థియేటర్ కి కదలడం లేదు. అదొక సమస్య వచ్చింది.

మరొక విషయంలో ఆ రోజుల్లో వినోద సాధనం సినిమాలు తప్ప మరొకటి ఉండేవి కావు. టీవీలు వచ్చినా సరే, కొత్త సినిమాలు వస్తే తప్పకుండా థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే. అదొక సంప్రదాయం నడిచేది. ఊరంతా పండగలా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అరచేతిలో వైకుంఠంలా ఉంది పరిస్థితి. మొబైల్ ఫోన్లలో మొదటిరోజే సినిమా చూసేస్తున్నారు. కాలంతో పాటు చిరంజీవి నట వైభవాన్ని మళ్లీ పున: ప్రతిష్ఠ చేయాలంటే అంత ఈజీ కాదని అంటున్నారు.

నాలుగో సమస్య… నెట్ ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తెరపైకి వచ్చాయి. ఇళ్లల్లోనే పెద్ద పెద్ద టీవీలు వచ్చేశాయి. దాంతో సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఇంటిలోకి సినిమా వచ్చేస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి లాంటి స్టార్ డమ్ ఉన్న హీరో సినిమా చూడాలంటే, ఇంటిలో కూర్చున్నవాళ్లని బయటకు రప్పించే శక్తి కావాలి. అది ఎలా? అనేది చిరు ముందున్న పెద్ద సమస్య. గాడ్ ఫాదర్ సినిమా బాగున్నా… అనుకున్నంత లాభాలు రాలేదని అంటున్నారు.

అందుకే ఇప్పుడు పక్కా మాస్ యాక్షన్ తో వాల్తేరు వీరయ్యని దించుతున్నారు. మరి ఇదేం రేంజ్ లో ఉంటుందో వెండితెరపై చూడాల్సిందే. మరి చిరు కోరుకుంటున్న బ్లాక్ బ్లస్టర్ హిట్ కొడుతుందా? అంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply