జాతీయ వార్తలు

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

శక్తి టీవీ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో పేరుతో ఈ భవన నిర్మాణం చేపట్టారు.

పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం ప్రధానిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది కూర్చునే వీలుంది. పార్లమెంట్ సంయుక్త సమావేశం జరిగితే లోక్‌సభ ఛాంబర్‌లోనే 1280 మంది సభ్యులు కూర్చోవచ్చని తెలిపింది.

2020 డిసెంబర్ 10న పార్లమెంట్ కొత్త భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని 1927లో నిర్మించారు. ఈ భవనం నిర్మించి 96 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ కు కొత్త భవనాన్ని నిర్మించాలని మోదీ సర్కార్ సంకల్పించింది. భారత ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేలా భారత సంస్కృతి చిహ్నాలతో నిర్మాణం చేపట్టారు.

Leave a Reply