క్రీడా వార్తలు

సూర్య సూపర్ సెంచరీ.. రషీద్ ఖాన్ మెరుపులు వృథా.. ముంబై విజయం..

శక్తి టీవీ, వెబ్ డెస్క్: సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ లో తన జోరును కొనసాగిస్తున్నాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గుజరాత్ పై ముంబై 27 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 103, 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులు), ఇషాన్ కిషన్ (31), రోహిత్ (29), విష్ణు వినోద్ (30) మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోర్ రెండు వందలు దాటింది. రషీద్ ఖాన్ మినహా గుజరాత్ బౌలర్లు అందరూ తేలిపోయారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆదిలోనే తడబడింది. వృద్ధిమాన్ సాహా (2), గిల్ (6), హార్ధిక్ పాండ్యా (4) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (41) కాసేపు నిలబడ్డారు. అభినవ్ మనోహర్ (2) , విజయ్ శంకర్ వెంటవెంటనే అవుట్ కావడంతో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మిల్లర్ , రాహుల్ తెవాటియా (14) జట్టు స్కోర్ 100 పరుగులు వద్ద అవుట్ అయ్యారు. ఈ దశలో గుజరాత్ స్కోర్ 120 దాటడం కూడా కష్టమే అనిపించింది.

అనూహ్యంగా రషీద్ ఖాన్ (79, 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సులు) రెచ్చిపోయాడు. జోసెఫ్ తో కలిసి 9 వికెట్ కు 40 బంతుల్లో 88 పరుగులు జోడించాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో ఆకాష్ మద్వాల్ 3 వికెట్లు, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ రెండేసి వికెట్లు, బెరెన్ డార్ఫ్ ఒక వికెట్ తీశారు. అద్భుతంగా సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Leave a Reply