త్వరలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి.. మోదీ కీలక ప్రకటన..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు సీఎంలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రసంగం చేశారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయని తెలిపారు. పాత పార్లమెంట్ లో తగినన్ని సీట్లు లేవని, సాంకేతిక సమస్యలున్నాయన్నారు. కొత్త పార్లమెంట్ కేవలం భవనం కాదన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింబంగా పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్త భవనం ఇస్తుందని స్పష్టం చేశారు. స్వతంత్ర సమరయోధుల కలల సాకార మాధ్యమంగా ఆత్మనిర్భర భారత్‌కు సాక్షిగా ఈ భవననం నిలుస్తుందన్నారు
దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయన్నారు మోదీ. అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు. నవ భారత్ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తోందని చెప్పారు. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోందన్నారు. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందని మోదీ పేర్కొన్నారు.