జాతీయ వార్తలు

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గట్టిగా పూజలు

ఢిల్లీ : మొత్తానికి ఆయన ఏమనుకుంటే అది చేస్తారు. అది కష్టమైనా, నష్టమైనా పర్వాలేదు. పోరాట తత్వమే ఆయన నినాదం, విధానం, వాటితోనే ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. తెలంగాణాలో వర్కవుట్ అయినట్టు, మరి భారత దేశమంతా అవుతుందా? లేదా? అనేది ప్రశ్నగా కాదు.. పజిల్ లా మారింది.

ఇలా అందరూ అనుకుంటుండగానే టీఆర్ఎస్ పార్టీ అంతలోనే బీఆర్ఎస్ పార్టీగా మారిపోవడం, మరోక్షణం ఆలోచించకుండా ఆవిర్భావ దినోత్సవం చేయడం, వెంటనే కేసీఆర్ ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కడం, అక్కడ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభ ఏర్పాట్లు చేసేయడం, ఆ వెంటనే తనకి కలిసివచ్చిన రాజశ్యామల యాగానికి కావల్సిన యాగశాల రెడీ అయిపోవడం…అంతా సినిమాలో జరిగినట్టు క్షణాల్లో జరిగిపోతోంది.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్టు అధికారంలో ఉన్నవాళ్లు తలచుకోవాలే గానీ కొండ మీద కోతి అయినా దిగి వస్తుందనే నానుడి ఇక్కడ నిజమవుతోంది. ముఖ్యంగా కేసీఆర్ యాగాన్ని చాలా గట్టిగానే చేస్తున్నారు. మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. గణపతి పూజ, పుణ్య హవచనం, యాగశాల సంస్కారం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణాలు, మూలమంత్ర జపాలు జరగనున్నాయి.

ఇవి జరిగిన మరుసటి రోజున నవచండీ హోమం, రాజ శ్యామల హోమం, ఇతర పూజా కార్యక్రమాలు, తదుపరి పూర్ణాహుతి నిర్వహించనున్నారు. శృంగేరీ పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి. దైవకృప, బీఆర్ఎస్ విజయం, దేశం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో కేసీఆర్ ఈ యాగాలు నిర్వహిస్తున్నారు. 12 మంది రుత్విక్కుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరగనున్నాయి.

అనంతరం బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తెలంగాణ నేతలందరూ ఢిల్లీ తరలివెళుతున్నారు.

Leave a Reply