తెలంగాణ

ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాల ముప్పు.. హైదరాబాద్‌ రోడ్లపై వాకింగ్‌ సేఫ్ కాదా? ..

శక్తి టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ రోడ్లపై వాకింగ్‌ సేఫేనా? బండ్లగూడ సన్‌ సిటీ యాక్సిడెంట్‌ తర్వాత… ఈ ప్రశ్న చర్చనీయాశంగా మారింది. ఓ యువకుడి ర్యాష్‌ డ్రైవింగ్‌ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. రోడ్డు పక్కగా మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని ఓవర్ స్పీడుతో కారు వెనక నుంచి వచ్చి ఢీకొంది. చనిపోయిన వారికి అసలు ఏం జరిగిందో తెలుసుకొనే అవకాశం లేకుండా వారు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు వంపు తిరిగి ఉందని, అప్పటికే ఓవర్ స్పీడులో ఉన్న కారు ఆ మలుపు దగ్గర నియంత్రణ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతులంతా బండ్లగూడ లక్ష్మీనగ‌ర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన అనంతరం కారులో ఉన్నవారంతా పరారయ్యారు. దర్యాప్తు మొదలుపెట్టిన నార్సింగి పోలీసులు.. మాసబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌కు చెందిన మహ్మద్‌ బద్రుద్దీన్‌ ఖాదిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న బద్రుద్దీన్‌ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మెయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో వేడుకలు చేసుకోవాలనుకున్నాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా.. ట్రావెల్‌ ఏజెన్సీలో కారును అద్దెకు తీసుకుని తన స్నేహితులు గణేశ్‌, ఫైజాన్‌, ఇబ్రహీంతో కలిసి ఉదయమే బయల్దేరాడు. సన్‌సిటీ దగ్గరకు రాగానే దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్న కారు మలుపు దగ్గర అదుపుతప్పింది. ముందున్న ఆటోను స్వల్పంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎడమవైపునకు వాహనాన్ని తిప్పడంతో ఫుట్‌పాత్‌ మీదుగా దూసుకెళ్లి వాకింగ్‌ చేస్తున్న అనురాధ, మమత, కవితను ఢీకొడుతూ పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో వాకర్స్‌ భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

కారు నడిపిన వ్యక్తి తోపాటు కారు ఓనర్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ -2, 337 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. కారు నడిపిన వ్యక్తి A1గా మహమ్మద్ బద్రుద్దీన్ ఖాదిర్, కారు మొదటి ఓనర్ A2-రెహమాన్ అని వెల్లడించారు పోలీసులు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇద్దరి ప్రాణాలు చేసిన యువకుడికి రెండేళ్ల శిక్ష పడనుంది.

Leave a Reply