అంతర్జాతీయ వార్తలు

వామ్మో.. నయాగరా ‘ఎక్కారా’?

శక్తి టీవీ, అమెరికా :- నయాగరా జలపాతం కదా.. మరి ఎక్కడమేమిటి? ఇదే కదూ మీ సందేహం? నయాగరాను అధిరోహించింది ముమ్మాటికీ నిజమే. అవును.. గడ్డకట్టిన స్థితిలో ఆ జలపాతాన్ని ఎక్కి తొమ్మిదేళ్లు. ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగానే ఉంది. ఐస్ క్లైంబర్లు విల్ గ్యాడ్, సారా హ్యూనికెన్ ఈ ఫీట్ సాధించారు. 2015 జనవరి 27న పాక్షికంగా గడ్డకట్టిన నయాగరాను వారు అవలీలగా ఎక్కేశారు.

అమెరికా-కెనడా సరిహద్దుల్లోని హార్స్‌షూ ఫాల్స్‌ను అధిరోహించిన తొలి పురుషుడు-మహిళగా వారిద్దరూ గిన్నిస్ రికార్డుల్లో ఉన్నారు. తొలుత విల్ గ్యాడ్ జలపాతాన్ని చకచకా ఎక్కేయగా.. ఆయనను సారా హ్యూనికెన్ అనుసరించింది. 30 అడుగుల పొడవు, 150 అడుగుల ఎత్తున హార్స్‌షూ ఫాల్స్‌ గడ్డకట్టిపోయింది.

ప్రపంచంలోనే అతి భీకర జలపాతంగా దీనికి పేరుంది. నయాగరాలోని మూడు సెక్షన్లలో కెనడా భూభాగంలోని హార్స్‌షూ ఫాల్స్‌ అతి పెద్దది. ఇది 2200 అడుగుల మేర విస్తరించింది. మిగిలిన రెండు జలపాతాలు అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వెయిల్ ఫాల్స్ అమెరికా భూభాగంలో ఉన్నాయి. ఎనర్జీ డ్రింక్ మేకర్ రెడ్‌బుల్ ఈ సాహసకృత్యాన్ని స్పాన్సర్ చేసింది.

ఈ ఫీట్ సాధించే నాటికి గ్యాడ్ వయసు 47 సంవత్సరాలు కాగా.. హ్యూనికెన్‌కు 34 ఏళ్లు. గడ్డకట్టిన నయగరా జలపాతాన్ని ఎక్కడం ఓ ఎత్తు అయితే.. అందుకు అనుమతులు పొందడం మరో ఎత్తు. అవి అంత సులభంగా లభించవు. రెడ్‌బుల్ సంస్థతో కలిసి 8 నెలలు కష్టపడితే కానీ ఐస్ క్లైంబర్లకు అనుమతి లభించలేదు. భద్రతాపరంగా తీసుకునే చర్యలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారుల గ్రీనసిగ్నల్ లభిస్తుంది.

Leave a Reply