తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ.. ఖమ్మం నుంచి బరిలోకి ?
శక్తి టీవీ, తెలంగాణ :- తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలవనున్నట్లు వార్తలొస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని గతంలోనే తీర్మానించగా.. అందుకు సోనియాగాంధీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. తాజాగా మరోసారి టి-కాంగ్రెస్ ఈ విషయంపై తీర్మానం చేయగా.. సోనియా గాంధీ అందుకు ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడం.. ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉండటానికి కారణం.. అక్కడ బలమైన నేతలు ఉండటమే. ఈ జిల్లా నుంచే రేవంత్ రెడ్డి కేబినెట్ లో ముగ్గురున్నారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.
ఖమ్మం జిల్లాను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్.. సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలెక్కువగా ఉన్నాయని అంచనా వేసింది. సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తే.. ఆ బాధ్యతను జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భుజాలకు ఎత్తుకోవాలి.
తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసి గెలిస్తే.. దక్షిణాదిలో కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటుందని హైకమాండ్ యోచన. కర్ణాటక మినహా బీజేపీకి అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకోవాలంటే.. ఈ పార్లమెంట్ ఎన్నికలే కీలకం కానున్నాయి. మరి సోనియాగాంధీ నిజంగానే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా ? లేక ఇది వార్తలకే పరిమితం అవుతుందో తెలియాలంటే.. కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.