మనల్ని ఎవడ్రా ఆపేది? పవన్ కొత్త సినిమా ట్యాగ్ లైన్
హైదరాబాద్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్. అసలు హరీష్ శంకర్ తో సినిమా ఉంటుందా? లేదా? అనే సందిగ్ధంలో అందరూ ఉండగా సడన్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ప్రకటించినట్టుగా భవదీయుడు భగత్ సింగ్ పేరును ఉస్తాడ్ భగత్ సింగ్ గా మార్పు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ టైటిల్ కింద ఒక ట్యాగ్ లైన్ ఇప్పుడందరినీ ఆకట్టుకుంటోంది.
అదే…‘మనల్ని ఎవడ్రా ఆపేది?’
ఇప్పుడు నెట్టింట ఈ ట్యాగ్ లైన్ హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఎట్టకేలకు హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ కల్యాణ్ సినిమా పట్టాలెక్కబోతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. అయితే తాజా చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుంటే, అయాంక్ బోస్ సినిమాటోగ్రఫర్ గా ఉన్నారు. సీనియర్ దర్శకుడు దశరథ్ స్క్రిప్ట్ వర్క్ లో పనిచేస్తున్నట్టు డైరక్టర్ హరీష్ శంకర్ తెలిపారు.
మరో సంగతేమిటంటే తాజాగా మళయాల రీమేక్ సినిమాని తెలుగులో భీమ్లానాయక్ గా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ అదే తరహాలో ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా తమిళచిత్రం ‘తెరి’కి రీమేక్ గా చేస్తున్నారని అనుకుంటున్నారు.
సినిమా విశేషాలు ఇవైతే, ఇక తాజాగా పవన్ కల్యాణ్ ప్రచార రథానికి ఆలివ్ గ్రీన్ కలర్ వేయడాన్ని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది తిరగకూడదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మనల్ని ఎవడ్రా ఆపేది?’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.