థియేటర్లలో బయట ఫుడ్ అనుమతిపై… సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ : కుటుంబ సమేతంగా, పిల్లాపాపలతో కలిసి హాయిగా సినిమా చూద్దామని వెళ్లే వాళ్లు సినిమా ముందు, ఇంటర్వెల్ కి ఏదొకటి కొనుక్కుని, అవి తింటూ సినిమా చూస్తుంటారు. మన భారతీయ ప్రేక్షకులకి అదొక అలవాటు అని చెప్పాలి. ఈ సందర్భంలో ప్రేక్షకుల బలహీనతలను అడ్డం పెట్టుకుని థియేటర్ యాజమాన్యాలు వారిష్టం వచ్చిన ధరలు పెట్టి, ప్రేక్షకుల ముక్కు పిండి వసూలు చేస్తున్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
అంతేకాదు… వారు ఆ స్టాల్స్ లో పెట్టినవే తినాలి. ఇది రూల్…అయితే చాలామంది తప్పనిసరై కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఆహారం, పానీయాలు, తినుబండారాలు థియేటర్ కి తీసుకువెళితే ఆపవద్దని జమ్మూకశ్మీర్ హైకోర్టు 2018లో ఆదేశించింది. దీంతో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, థియేటర్ యాజమాన్యాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో తాజా తీర్పు సారాంశం ఏమిటంటే… సినిమా థియేటర్లకు బయట నుంచి ఆహారం, పానీయాలు తీసుకురాకుండా ఆపే హక్కు హాల్ యజమానికి ఉందని తేల్చి చెప్పింది.
సినిమా హాల్ అనేది ఒక ప్రైవేటు వ్యక్తి ఆస్తి, అందులో తనకి నచ్చితే అనుమతి ఇవ్వవచ్చు, లేదంటే మానేయవచ్చునని పేర్కొంది. ఇంక థియేటర్లలో ఖచ్చితంగా తినుబండారాలు కొనాలన్నా నిబంధనేది లేదు కాబట్టి, అది ప్రేక్షకుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే హాళ్ల యాజమాన్యం ప్రేక్షకులకి మంచినీళ్లను మాత్రం అందించాలని తెలిపింది.
మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో ప్రేక్షకులు హతాశుయులయ్యారు. కాకపోతే థియేటర్ యాజమాన్యాల వైపు కూడా న్యాయం ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ప్రేక్షకులకే తినుబండారాలు పట్టుకెళ్లే అవకాశమే ఇస్తే, దానిని శుభ్రం చేసుకోవడం వారి తరం కాదని, డ్రింక్స్ ఒంపేసి, చిప్స్ విసిరేసి నానా బీభత్సం చేస్తారని సుప్రీంకోర్టు బాగానే చెప్పిందని కొందరు వ్యాక్యానిస్తున్నారు.