లోకేష్‌కు అసలు.. సిసలైన పరీక్ష.. ఇక్కడ పాదయాత్ర పూర్తిచేస్తే.. రాష్ట్రమంతా చేసినట్లేనా..
చిత్తూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు లోకేష్ 422.8 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసిన లోకేష్(Nara Lokesh) గురువారం రాత్రి పుంగనూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం కావడంతో.. లోకేష్ అసలు సిసలైన పరీక్షను ఎదుర్కోబోతున్నారని, ఈన నియోజకవర్గంలో విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేస్తే.. ఇక రాష్ట్రమంతా పాదయాత్ర పూర్తైనట్లేనన్న ప్రచారం సాగుతోంది. మార్చి 3వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పులిచర్ల మండలం కొమ్మురెడ్డిపల్లిలోని విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎగువ బెస్తపల్లిలో బెస్త సామాజికవర్గీయులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు.
మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు మంగళంపేట మెయిన్ సెంటర్ లో స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటల20 నిమిషాలకు బలిజపల్లిలో భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు బలిజపల్లి నుంచి పాదయాత్రను పునఃప్రారంభిస్తారు. సాయంత్రం 5గంటల30 నిమిషాలకు మొప్పిరెడ్డిగారిపల్లిలో స్థానికులతో సమావేశం అవుతారు. 6గంటల35 నిమిషాలకు పులిచర్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. రాత్రి 7గంటల 40 నిమిషాలకు కొక్కువారిపల్లి విడిది కేంద్రంలో బస చేస్తారు లోకేష్.
నారా లోకేష్ పుంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం తమ యువ నాయకుడు లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.