అవినాశ్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట
హైదరాబాద్ : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మందస్తు బెయిల్ పిటిషన్ కు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఈనెల 25వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటివరకు అవినాశ్ రెడ్డి ప్రతిరోజు విచారణకు హాజరుకావాలని తెలిపింది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని పేర్కొంది. ఈనెల 25వ తేదిన బెయిల్ పై తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.
సోమవారం మధ్యాహ్నం విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా అటు సీబీఐ, సునీతారెడ్డి.. ఇటు అవినాశ్ రెడ్డి లాయర్ల మధ్య హోరాహోరీ వాదనలు జరిగాయి. ఒకనొక దశలో సునీత, అవినాశ్ లాయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.