ఆంధ్రప్రదేశ్

మూడు రోజులపాటు విశాఖలోనే సీఎం జగన్‌.. తరలిరానున్న పారిశ్రామిక దిగ్గజాలు..

విశాఖపట్టణం : విశాఖపట్టణంలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న ప్రపంచ పెట్టుబడుదారుల సదస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు.. వీలైనన్ని ఎక్కువ అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖపట్టణంలో పర్యటిస్తారు. మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో దాదాపు 25 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సదస్సుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు సదస్సులో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి షెడ్యూల్‌

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటల15 నిమిషాలకు గంటలకు విశాఖపట్నం(Visakhapatnam) చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మార్చి 3వ తేదీ ఉదయం 9గంటల 10 నిమిషాలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాత్రి 8గంటల నుంచి 9 గంటల వరకు ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన డెలిగేట్స్‌కు ఏర్పాటుచేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు, అనంతరం రాత్రి విశాఖపట్టణంలోనే బస చేస్తారు. మార్చి 4వ తేదీ ఉదయం 9గంటల 10నిమిషాలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3గంటల 40 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

విశాఖపట్నంలో మూడు, నాలుగు తేదీలలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలి రానున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఇప్పటివరకు 25 ప్రత్యేక విమానాలు విశాఖకు రాబోతున్నాయన్న సమాచారం అందిందని, 18 విమానాలను విశాఖ ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసే అవకాశం ఉందని, మిగిలిన విమానాలు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలించనున్నామని చెప్పారు.

పదివేల మంది నమోదు

పెట్టుబడి దారుల సదస్సు నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేర్గాంచిన పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు తరలిరానున్నారు. అంబానీ, కరణ్ అదాని, కుమార్ మంగళం బిర్లా తదితరులు విశాఖపట్టణం రానున్నారు. వీరందరికి విశాఖ నగరంలోని వివిధ హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ హోటళ్లలో 600 గదుల వరకు సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం.

ఇప్పటివరకు సదస్సులో పాల్గొనేందుకు పదివేల మంది రిజిస్టర్ చేయించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో అత్యధిక పెట్టుబడులు వచ్చే విధంగా ఉన్నాయని, ఇది రాష్ట్రంలో మేజర్ సెక్టర్ కాబోతోందని ఐటీ శాఖ మంత్రి అమర్‌నాధ్ తెలిపారు. అలాగే పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఫార్మా రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు.

Leave a Reply