తీరాన్ని తాకిన తుపాన్.. గుజరాత్ లో భారీ వర్షాలు..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: అతితీవ్ర తుపాన్ బిపోర్జాయ్.. ఎట్టకేలకు తీరాన్ని దాటింది. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోట్ లఖ్పత్ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని తాకింది. తుపాన్ ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్నాయి.
దాదాపు 20 తీరప్రాంత గ్రామాలకు చెందిన లక్షమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు తుపాన్ తీరం దాటిన ప్రాంత పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
ద్వారకలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం మూసి వేశారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలువులు ప్రకటించారు. సహాయ చర్యలు చేపట్టేందుకు 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రహదారులు-భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్తు శాఖకు చెందిన 397 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. 76 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది.
తుపాన్ ప్రభావంతో కచ్, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, దేవ్భూమి ద్వారక, అమ్రేలీ సహా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరంతోపాటు దమణ్ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కచ్చా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.