తెలంగాణ

దాహపు కేకలకు శుభం కార్డు వేయండి.. సీఎం రేవంత్ రెడ్డి

శక్తి టీవీ, హైదరాబాద్ :- రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టిసారించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరం తో సహా, రాష్ట్రవ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం పలు సూచనలు జారీ చేశారు.

వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జలమండలి బోర్డు సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సీఎం, త్రాగునీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారులు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

గతంలో ఏఏ జిల్లాల్లో త్రాగునీటి ఎద్దడి సమస్య అధికంగా ప్రభావం చూపిందన్న విషయంపై సీఎం ఆరా తీశారు. వచ్చే వేసవిలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎక్కడ సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరంలో సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై సుదీర్ఘ చర్చ సాగింది. హైదరాబాద్ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అధికారుల అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో సైతం నీటి సమస్య తలెత్తకుండా స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం కోరారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైందని చెప్పవచ్చు.

Leave a Reply