రూ.10 విలువ చేసే వాటర్ బాటిల్ ధర 100 రూపాయలా?..స్పందించిన జొమాటో!
శక్తి టీవీ, వైరల్ :- పబ్లిక్ ఈవెంట్లలో సాధారణంగా వ్యాపారులు నిర్ణయించిన ధరకు మించి అమ్ముతారు. జాతరలు, సభలు సహా ఇతర కార్యక్రమాలల్లోనూ ఎమ్మార్పీతో సంబంధం లేకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. రూ. 10 విలువ చేసే వాటర్ బాటిల్ లేదంటే బిస్కెట్ ప్యాకెట్లను రూ. 15 లేదంటే రూ. 20కి అమ్ముతారు. కానీ, తాజాగా ఓ ఈవెంట్ లో జొమాటో సంస్థ రూ. 10 విలువ చేసే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ను ఏకంగా రూ. 100 రూపాయలకు అమ్మడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జోమాటో సంస్థపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వ్యవహారంపై జొమాటో రియాక్ట్ అయ్యింది.
ఈవా లైవ్ ఈవెంట్ లో అధిక ధరకు వాటర్ బాటిళ్ల అమ్మకం
రీసెంట్ గా ఈవా లైవ్ అనే సంస్థ ఓ మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు జొమాటో టికెటింగ్ పార్ట్ నర్ గా ఉంది. అదే ఈవెంట్ లో జొమాటో సంస్థ ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, వాటర్ బాటిళ్లు, ఫుడ్ అమ్మకాలు చేపట్టింది. అయితే, రూ. 10 విలువ చేసే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్, ఏకంగా రూ. 100కు అమ్మడంపై ఓ టెక్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. “మ్యూజికల్ ఈవెంట్ లోకి సొంత వాటర్ బాటిళ్లు తెచ్చుకునేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. కచేరీ ప్రాంగణంలో రూ. 10 విలువ చేసే వాటర్ బాటిళ్లను రూ. 100కు అమ్ముతున్నారు. ఇంత ధరకు అమ్మడానికి జొమాటోకు ఎవరు అనుమతించారు?” అని పల్లబ్ డే అనే టెక్కీ ప్రశ్నించాడు. అంతేకాదు, తన దగ్గర రెండు హాఫ్ లీటర్ వాటర్ బాటిళ్లకు ఏకంగా రూ. 200 వసూళు చేశారంటూ ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్ తో పాటు వాటర్ బాటిళ్లు అమ్మే స్టాల్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ పోస్టుకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదిని ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
స్పందించిన జొమాటో
పల్లబ్ పెట్టిన పోస్టుపై జొమాటో స్పందించింది. కానీ, సరైన సమాధానం ఇవ్వలేదు. “హాయ్ పల్లబ్, మీకు జరిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నాం. మేం ఈ ఈవెంట్ ఆర్గనైజర్లం కాదు. కేవలం టికెటింగ్ భాగస్వామిగా ఉన్నాం. మీ బాధను అర్థం చేసుకున్నాం. మా సొంత ఈవెంట్లు జరిగినప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం” అని రాసుకొచ్చింది.
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
జొమాటో వ్యవహారంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. “జొమాటో తీరు దారుణం. ఇది నిజంగా వినియోగదారులను దారుణంగా దోపిడీ చేయడం అవుతుంది. ఈ సంస్థకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గళం విప్పాల్సిన అవసరం ఉంది” అని ఓ నెటిజన్ స్పందించారు. “వెంటనే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయండి. జనాలను పీడిస్తున్న జొమాటోకు తగిన బుద్ధి చెప్పండి. దోపిడీ చేసిన మొత్తాన్ని కక్కించండి” అని ఇంకో నెటిజన్లు కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.