న్యాయం గెలిచింది…స్కిల్ డెవలప్మెంట్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు.. చంద్రబాబుకు బెయిల్..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. వైద్య పరీక్షల కోసం ఆయనకు నాలుగు వారాల బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ గడువు ఈ నెల 28తో ముగియనుంది. ఈలోగా రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇక చంద్రబాబు మళ్లీ సరెండర్ కావాల్సిన అవసరం లేదు.
చంద్రబాబు పిటిషన్‌పై గురువారం వాదనలు ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.
లొంగిపోయేటప్పుడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్ కవర్లో వైద్య నివేదికలు అందజేయాలన్న కోర్టు ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారన్నారు ఏజీ పొన్నవోలు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవన్నారు. మధ్యంతర బెయిలు పొందిన చంద్రబాబు.. హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని తెలిపారు.
ఈ కేసులో ఇతర నిందితులకు బెయిలు మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదన్నారు. అందువల్ల బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు. తాజాగా ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది.