జనసేనతో కలిసే పోటీ చేస్తామన్న పురందేశ్వరి.. టీడీపీతో పొత్తు సంగతేంటి ?
శక్తి టీవీ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె..ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తుందని, రాష్ట్రప్రభుత్వం ఒక్క పనికూడా సొంత నిధులతో చేయడం లేదన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు అని పేర్కొన్న పురందేశ్వరి.. గతుకుల రోడ్లతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. పనులు పూర్తిచేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంపై ధ్వజమెత్తారు. అలాగే రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఏపీలో జరుగుతున్న కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి.. కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై కంటే.. లోన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు.
కాగా.. రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ చేస్తామని ప్రకటించడంతో.. జనసేన- టీడీపీ పొత్తు సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు విషయంలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, ఆ వెంటనే పవన్ కల్యాణ్ చంద్రబాబునాయుడిని జైల్లో పరామర్శించడం, టీడీపీతో పొత్తు ప్రకటించడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి.
జనసేన ఈసారి ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోదని వారాహి యాత్రలో చెప్పుకొచ్చిన పవన్.. చంద్రబాబు అరెస్ట్ తో తన మాట మార్చారు. జగన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పడంతో.. ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన.. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతివ్వగా.. అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేయడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. టీడీపీ ఓటమిపాలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు మొదట బీజేపీతో కలిసి నడుస్తామన్న పవన్.. ఆ తర్వాత టీడీపీతో పొత్తు ప్రకటించడం చర్చనీయాంశమైంది. తాజాగా పురందేశ్వరి జనసేనతో కలిసే పోటీ చేస్తామనడంతో.. ఈ మూడుపార్టీలు కలిసి బరిలోకి దిగుతాయా ? లేక జనసేన యూ టర్న్ తీసుకుంటుందా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయానికి ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.