Subsidiary Of KPS Digital Media Network

తెలంగాణ

రెబల్స్ బెడద.. గులాబీ పార్టీలో గుబులు.. నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి..

శక్తి టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 3,504 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం లేని 606 నామినేషన్లు తిరస్కరించారు. దీంతో చివరికి 2,898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. దీంతో అసలై ఎంతో మంది పోటీలో ఉంటారో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైన తర్వాత క్లారిటీ రానుంది.

మరోవైపు రెబల్స్ ను బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారిని దారికి తెచ్చుకునేలా మంతనాలు సాగిస్తున్నాయి. బీఆర్ఎస్ కు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. వారిని నయానో భయానో నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ గులాబీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని చోట్ల నేరుగా అధిష్టానం కూడా రంగంలోకి దిగుతోంది.బాబ్బాబు కొంచెం బెట్టు వీడండి అంటూ అసంతృప్తులను బతిమాలుతోంది. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ సహా.. అత్యధికంగా నామినేషన్స్ దాఖలైన నియోజకవర్గల్లో పార్టీ అభ్యర్థులకు చలికాలంలోనే ముచ్చెమటలు పడుతున్నాయి. అత్యధికంగా కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 114 మంది పోటీ చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

తెలంగాణలో పోలింగ్‌కి ఇక రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్‌కి ప్రజా వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అలాగే సొంత పార్టీ నుంచి రెబల్స్‌ బెడద ఎక్కువగానే ఉంది. అభ్యర్థుల ప్రకటన, బీ-ఫామ్‌ల అప్పగింత వరకు అలకలు, ఆగ్రహాలు కారు పార్టీలో పెల్లుబికాయి. టికెట్లు దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. కొన్ని చోట్ల తీవ్రమైన ఒత్తిడితో బీ-ఫామ్‌లు మార్చి మరొకర్ని పోటీకి దింపారు. ఇంతచేసినా గ్రౌండ్‌లో వ్యతిరేక పవనాలు వీస్తుండగా గెలిచేందుకు పింక్‌ పార్టీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. బుజ్జగింపులతో దారికి రాకుండా నామినేషన్‌ వేసి బెట్టుచేస్తున్నవారిపై దృష్టిపెట్టింది. గజ్వేల్‌ సహా అనేక చోట్ల అసంతృప్తులు పోటీ చేయగా వాళ్లతో నామినేషన్‌ ఉపసంహరింపజేసేలా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అత్యధికంగా నామినేషన్లు దాఖలైన చోట గులాబీ అభ్యర్థులు ఏకంగా పొర్లు దండాలు పెడుతూ విత్‌ డ్రా చేసుకోవాలని బతిమాలుతున్నారట.

సోమవారం నాడు నామినేషన్ల పరిశీలన ముగిసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ లోపు రెబల్స్‌, అసంతృప్తులని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ నానా పాట్లు పడుతోంది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే గుర్తు టెన్షన్‌తోపాటు ఓట్లు చీలుతాయని అధికార పార్టీకి గుబులు పట్టుకుంది. అనేక నియోజకవర్గాల్లో 20 మందికి పైగానే నామినేషన్లు ఆమోదం పొందడం గులాబీలో కలకలం రేపుతోంది. అత్యధికంగా నామినేషన్లు దాఖలైన నియోజకవర్గాలపై బీఆర్ఎస్‌ నేతలు ఫోకస్‌ పెట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇచ్చిన హామీలు విస్మరించారంటూ రైతులతో పాటు నిరుద్యోగులు అనేక మంది నామపత్రాలు దాఖలు చేశారు. గజ్వేల్‌ 114, కామారెడ్డిలో 58 నామినేషన్లు ఓకే అయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల నామినేషన్లు గులాబీకి గుబులు రేపుతున్నాయి. నామినేషన్లు వేసిన వారి ఇళ్లకు గులాబీ నేతలు క్యూ కడుతున్నారు. విత్‌ డ్రా చేసుకోవాలని దండం పెట్టి మరీ ప్రాధేయపడుతున్నారు. ఏం కావాలన్నా చేస్తామని… నామినేషన్ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అనేక చోట్ల అభ్యర్థుల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. బుజ్జగింపులకి లొంగేది లేదని మొఖం మీదనే చెప్పేస్తున్నారట. చేసేదేం లేక మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. నామినేషన్‌ వేయడం సహా మిగతా ఖర్చులన్నీ ఇస్తామని కాళ్ల బేరానికి వస్తున్నారట. పార్టీలోకి తిరిగి రావాలని దీనంగా వేడుకుంటున్నారట. అధికారంలోకి వస్తే కోరుకున్న పదవులు ఇస్తామని బుజ్జగిస్తాన్నారట. ఎంత చెబుతున్నా అసంతృప్తులు మాత్రం పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతున్నారట.

ఎంత బతిమాలినా వినకపోవడంతో అభ్యర్థులు మరో రూట్లో ట్రై చేస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్‌లు రంగంలోకి దింపారట. నామినేషన్స్ వేసిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల బంధువులను బతిమాలుతున్నారట. ఫ్రెండ్స్‌తో రాయభారం నెరపుతున్నారట. ఎవరు చెబితే వింటారో వాళ్లని ఎంచుకుని తాయిలాలు ఎరగా వేస్తున్నారట గులాబీ నేతలు. కొందరు ఒప్పుకొంటుండగా.. మరికొందరు ఆలోచిద్దామని చెబుతున్నారట. ఈ టెన్షన్‌ అంతా బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుండగా.. ఉపసంహరణ ప్రక్రియ పూర్తైతే ఏఏ నియోజకవర్గాల్లో ఎంత మంది పోటీ చేస్తారో క్లారిటీ రానుంది. ఇక ఆ తర్వాత అభ్యర్థుల విజయవకాశాలను పోటీలో ఉన్నవాళ్లు ఎంత మేరకు డ్యామేజ్‌ చేస్తారనే స్పష్టత కూడా రానుంది.

Leave a Reply

Chris Morphe

Chris Morphe

Typically replies within an hour

I will be back soon

Chris Morphe
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×