ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన చంద్రబాబు..

శక్తి టీవీ, ఏపీ :- ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. సోమవారం గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నది. ఈ విషయంపై మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, అదే పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూ సేకరణ జరిపి లే-అవుట్లు వేయని స్థలాల్లో కూడా పేద ప్రజలకు ఇళ్ల స్థలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

‘అయితే.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తదంటూ సీఎం చంద్రబాబు సమీక్షలో పేర్కొన్నారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిలో మొత్తంగా 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టింది. ఇళ్లు పూర్తయినా కూడా వాటికి పేమెంట్లను చెల్లించలేదు. అలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకే ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నాం. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. అయితే, ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం పలువురికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది.. కానీ, అక్కడ మౌలిక సదుపాయలను కల్పించలేదు.. అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గత వైసీపీ సర్కారు వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ. 10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ప్రత్యేకతలు లేకుండానే వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది’ అంటూ మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply