తిరుపతి వెళ్లే వారికి అలర్ట్..! అమల్లోకి పోలీసుల కొత్త వ్యవస్థ..!
శక్తి టీవీ, తిరుపతి :- తిరుపతికి వచ్చే సందర్శకులకు పోలీసు శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. నగరంలో భద్రత కోసం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై నగరానికి వచ్చే పౌరుల వివరాలను నమోదు చేయబోతున్నారు. ఈ వివరాలన్నీ పోలీసులు ఏర్పాటు చేసిన వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. కాబట్టి ఈ కొత్త వ్యవస్థపై తిరుపతికి వచ్చే వారు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. దీని వివరాలను తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ వెల్లడించారు.
తిరుపతిలో ప్రజల భద్రత కోసం పోలీసులు ఇవాళ సీవీఐఆర్ఎంఎస్ (సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్)పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో ప్రజల భద్రత, నేర నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయడానికి దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ వ్యవస్థ ద్వారా హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌసులు, పీజీలు తదితర ప్రదేశాలలో వచ్చే సందర్శకుల వివరాలు ఆధార్ ప్రూఫ్‌తో నమోదు చేస్తారు. ఆ వివరాలు పోలీస్ రికార్డులతో అనుసంధానం చేస్తారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు అలర్ట్ వస్తుంది.
ఇప్పటివరకు 644 హోటల్స్, హోమ్ స్టేలలో ఈ వ్యవస్దను ప్రవేశపెట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నగరంలోని హోటల్స్, లాడ్జ్ లు, హోంస్టేలకు బయట జిల్లాలు , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి యొక్క సమాచారం సేకరించి ఈ-పోర్టల్ ద్వారా వారి వివరాలు నమోదు చేస్తారు. ఇలా చేయటం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడనుంది. కేసుల దర్యాప్తులో ఇది కీలకంగా పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు. త్వరలో ఐ కాంటాక్ట్ వివరాలు కూడా తీసుకుంటామన్నారు.
ఈ వ్యవస్ధ వల్ల హోటల్ యజమానులకు, హోమ్ స్టే వారికి కూడా సేఫ్టీ గా ఉంటుందన్నారు. మూడు నెలలుగా దీనిపై కసరత్తు చేశామని, తిరుపతిలో పూర్తయిన తర్వాత శ్రీకాళహస్తిలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీని వల్ల తిరుపతి నగరంలో ప్రజల భద్రతతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై రియల్ టైమ్ నిఘా కూడా ఉంటుందన్నారు. నేర నిరోధక చర్యలు, విచారణలు వేగవంతం అవుతాయన్నారు. ఫేక్ ఐడీల్ని కూడా అడ్డుకోవచ్చని తెలిపారు.