వైసీపీ గాడిదలు ఏదొకటి అంటాయి: పవన్ కల్యాణ్
అమరావతి : అన్నం పెట్టిన రైతు కన్నీళ్లు పెడితే ఆ నేల సుభిక్షంగా ఉండదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో అట్టహాసంగా ప్రారంభమైన జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర సభా వేదికపై నుంచి మాట్లాడుతూ వైసీపీ వాళ్లు రకరకాలుగా మాట్లాడతారు, నిజానికి నాకు వారిలా తాతలు సంపాదించిన డబ్బుల్లేవు, లేదంటే అక్రమాలు దోపిడీలు చేసి సంపాదించనదీ లేదు, లేదంటే నా పార్టీకి వేలకోట్ల విరాళాలు రాలేదని అన్నారు.
మానాన్న ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అని తెలిపారు. నేను కష్టపడి సినిమాలు చేసి, ఆ వచ్చే డబ్బులతో, ఇంకా కొందరు తృణమో ఫణమో ఇస్తే పార్టీని నడుపుతున్నాను అని తెలిపారు. అయితే పార్టీని నడపడం అంత సులువు కాదని తెలిపారు. పార్టీ అంటే ఒక బాధ్యత, అది ప్రజల బాధ్యత తీసుకోవడమేనని తెలిపారు.
నిజానికి భూమిని సాగు చేసేది కౌలురైతులే. అలాంటి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూసి నా మనసు తట్టుకోలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ అలా ఆంధ్ర దేశంలో లెక్కలు తీస్తే 3వేల మంది పైనే ఉన్నారని తేలిందని అన్నారు. అందుకే మనకి అన్నం పెట్టే రైతుని ఆదుకోవాలని, ఈ కౌలు రైతు భరోసా యాత్రని చేపట్టామని వివరించారు.
నేను బయటకు వస్తే వైసీపీ వాళ్లు గోల. ఇలాగంటారు, అలాగంటారు, బయటకు రానివ్వరు, వారాంతపు పొలిటీషియన్ అంటారు. కానీ నేను వారానికి ఒకసారి వస్తేనే ఇంత గోల చేస్తే, రోజూ వస్తే మీరెంత గోల చేస్తారు? అలా వచ్చేరోజులు కూడా ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.
మనం ఏదొకటి చేసి రైతులను ఆదుకోవాలని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. కనీసం మనమైనా ఇద్దామని భావించి ఒక రూ.5 కోట్లతో దీనిని ప్రారంభించామని తెలిపారు. ఇంత సాయం చేస్తున్న జనసేనకు మీరు అధికారమిస్తే, మీ సొమ్ములని అంటే ప్రజల ఖజానాని ఎంతో బాధ్యతగా, ఎంతో ధర్మబద్ధంగా ఖర్చు చేస్తామని పవన్ తెలిపారు. ముఖ్యంగా రైతులని ఆదుకుంటామని తెలిపారు.
నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకుని అడగండి అని అన్నారు. బెదిరించే నాయకులు ఉంటే, ఎదిరించే యువత మన జనసేన వైపే ఉందని అన్నారు. నేను మద్దతు పలికిన తెలుగుదేశంతోనే గొడవ పడిన వాడిని, నాకు ఎవరిమీదా ప్రేమా ఉండదు, కోపం ఉండదని తెలిపారు. నాకు కావల్సిందల్లా రిజల్ట్ మాత్రమే. నేను ప్రజల కోసం ఇది అడిగా… ఇది చేయండి అన్నాను, చేయలేకపోతే నాకు మీతో పని లేదని బయటకు వచ్చేశానని అన్నారు.
అయితే వైసీపీ వారిని ఉద్దేశించి ఎప్పటిలాగే సెటైర్లు వేశారు. వైసీపీ గాడిదలు మళ్లీ ఏదొకటి అంటాయి. వాళ్లు కరెక్టుగా మాట్లాడితే, నా అంత మంచివాడు లేడని అన్నారు. మొత్తానికి ఆవేశంతో మాట్లాడలేదు. రెచ్చిపోలేదు. రెచ్చగొట్టలేదు. మాటల్లో తీవ్రత తగ్గలేదుగానీ, చెప్పే విధానంలో తీవ్రత తగ్గించి ఒక కొత్త మార్పుకి పవన్ శ్రీకారం చుట్టారు.