ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి!

శక్తి టీవీ, ఆంధ్రప్రదేశ్ :- చంద్రబాబు కేబినెట్‌లో ఎవరు ఉండబోతున్నారనే దానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. కాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మరోరెండు శాఖలను ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ చంద్రబాబు మంత్రివర్గంలో కీలక పదవి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు మరో రెండు కీలక శాఖలను ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా కూటమిలో భాగంగా ఉన్న జనసేన, బీజేపీ నుంచి మరికొందరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీ పార్టీలలో నుంచి చెరో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply