జాతీయ వార్తలు

కశ్మీర్‌లో లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలు.. వేలం వేయనున్న కేంద్రం.. ఎవరి చేతుల్లోకి వెళ్తుందో మరి..!

ఢిల్లీ : Lithium Reserves: ఈ నెల ప్రారంభంలో భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో రికార్డు స్థాయిలో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలు, మొబైల్ బ్యాటరీల్లో కీలకంగా ఉండే ఈ లిథియంతో భారతదేశ ప్రాధాన్యం మరింత పెరగనుంది. అయితే .. ఈ లిథియం రిజర్వ్స్‌ను కేంద్రం వేలం వేయనుంది.

భారతదేశంలో ఈ ఫిబ్రవరి 10న గుర్తించిన లిథియం నిల్వలను (Lithium Deposits in India) వెలికితీసేందుకు, శుద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లలో అన్నింటిలోనూ శక్తికి అవసరమైన బ్యాటరీల్లో లిథియం కీలకంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. భవిష్యత్తులో ఈ రంగంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లిథియం డిపాజిట్ల వేలం (Lithium Reserves Auction) ప్రక్రియను జూన్‌లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గానికి చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.

ఫిబ్రవరి ఆరంభంలో జమ్ముకశ్మీర్ రియాసీ జిల్లాలో ఏకంగా 5.9 మిలియన్ టన్నుల (59 లక్షల టన్నులు) లిథియం నిక్షేపాలను గుర్తించినట్లు వెల్లడించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI). దీంతో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఏడో స్థానం ఆక్రమించింది. లిథియం నిక్షేపాల వెలికితీతలో మొత్తం వేర్వేరు లెవెల్స్ ఉంటాయని, ప్రస్తుతం గుర్తించింది G-3 లెవెల్ అని చెప్పిన ఉన్నతాధికారి.. ఈ క్లిష్టమైన నాన్ ఫెర్రస్ మెటల్ వెలికితీత తర్వాతి దశ అని అన్నారు. అందుకోసమే అతిత్వరలో కేంద్రం ఇందుకోసం బిడ్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం బొలీవియాలో అత్యధికంగా 21 మిలియన్ టన్నుల మేర లిథియం నిల్వలతో తొలిస్థానంలో ఉండగా.. అర్జెంటీనాలో 20 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా (12 మిలియన్ టన్నులు), చిలీ (11 మి. టన్నులు), ఆస్ట్రేలియా (7.9 మిలియన్ టన్నులు), చైనా (6.8 మిలియన్ టన్నులు) ఉండగా.. భారత్ 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలతో ఏడో స్థానంలో ఉంది. జర్మనీలో 3.2 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి.

ఇదే సమయంలో లిథియం నిల్వల వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఇతర ఆక్షన్ల మాదిరిగానే ఉంటుందని ఆయన చెప్పారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. లిథియం శుద్ధి చేసే ప్రక్రియ కూడా పూర్తిగా భారత్‌లోనే జరగాలని, ప్రాసెసింగ్ కోసం విదేశాలకు పంపించే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేసింది కేంద్రం. అయితే ప్రస్తుతానికి భారత్‌లో లిథియం శుద్ధి చేసే సదుపాయం మాత్రం లేదు. 2030 కల్లా మెజారిటీ వాహనాలను భారత్‌లో ఎలక్ట్రిక్‌గా మార్చాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. అందుకే ఎలాగైనా లిథియం శుద్ధి ప్రక్రియను భారత్‌లో చేపట్టేందుకు అందుకు అవసరమైన టెక్నాలజీని తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మైనింగ్ కోసం చాలానే సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఎంత త్వరగా బిడ్డింగ్ ప్రక్రియ ముగిస్తే.. అంతే త్వరగా తదుపరి పనులు మొదలు పెట్టొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply